పాపికొండల సౌందర్యం గురించి చాలాసార్లు విన్నా , ఆ సౌందర్యం మాకు కొన్ని గంటల దూరంలోనే ఉన్నా , అనేక కారణాల వల్ల నేనెప్పుడూ వాటిని చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. మా అమ్మాయిలు దసరా సెలవులు సందర్భంగా , వారి బలవంతం మీద ఈసారి బయలుదేరాం.
ఈ యాత్ర లో నేను తీసిన కొన్ని ఫొటోలను ఉంచాను చూస్తూ చదవండి.
కొన్ని ప్రదేశాలు మనం వేసుకున్న అంచనాలకు అందుకోక నిరాశను కలిగిస్తాయి.కొన్ని ప్రదేశాలు అంచనాలకు మించి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కోవకి చెందినవే పాపికొండలు. నేను అనుకున్నదానికంటే బాగా రసానుభూతిని కలిగించిందా ప్రదేశం.
ఉదయం 8.30 కి పట్టిసీమ లో మా ప్రయాణం ప్రారంభమై తిరిగి సాయంకాలం 6.00 కి పట్టిసీమ రేవులో అంతమైంది. సుమారుగా ఈ 10 గంటల ప్రయాణంలో మా పున్నమి (మా బోటు పేరు ) ప. గో.జిల్లా , తూ.గో. జిల్లా , ఖమ్మం జిల్లా ల మధ్య గోదావరి నదిలో సాగింది. ఈ రాష్ట్రం రెండుగా విడిపోతే దీనిని 2 రాష్ట్రాల మధ్య ప్రయాణం అని కూడా చెప్పవచ్చు.
పట్టిసీమలో ప్రారంభమైన మా ప్రయాణం గండిపోచమ్మ, దేవీ పట్నం, పురుషోత్తపట్నం , కొరటూరు మీదుగా పేరంటపల్లి వరకూ సాగింది. వెళ్ళేటప్పుడు గోదావరి వాలుకు ఎదురు ప్రయాణం , పైగా అక్కడక్కడా ఆగటం వల్ల సుమారు 5 గంటల సమయం పట్టింది. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడా ఆగకపోవటం కారణంగా 4 గంటల సమయం మాత్రమే పట్టింది.
దారిలో కనీసం కరెంట్ , రోడ్ సౌకర్యాలు లేని చిన్న చిన్న పల్లెలని చూశాం. దారిలో గతంలో తీసిన తెలుగు సినిమాల లొకేషన్లు , షూటింగ్ స్పాట్లూ గైడ్ ద్వారా తెలుసుకున్నాం. ఎక్కడా విసుగనిపించకుండా బోట్ లో డాన్స్ పోటీలూ, అంత్యాక్షరీ, హౌసీ గేమ్ వగైరాలతో కాలం చాలా త్వరగా ఖర్చయిపోతుంది.
పాపికొండలకి దగ్గరయ్యేకొలదీ కొండల మధ్య నది ప్రవహించే దారి బాగా ఇరుకై పోయింది. అక్కడ లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని , సుమారు 110 అడుగులు ఉండవచ్చని గైడ్ చెప్పాడు. అక్కడకు వచ్చేసరికి మధ్యాహ్నం గం.2.౦౦ అయ్యింది.
మా అదృష్టమో ఏమో, ఆ సమయంలోనే ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బోటు ముందు వైపు డెక్ మీద నిల్చుని ఫొటోలు తీస్తున్న నాపై చినుకుల జడి ప్రారంభమైంది. కెమెరాను తడవకుండా చూసుకుంటూ కొన్ని దృశ్యాలను దానిలో బంధించాను. చూస్తుండగానే వాన ఉధృతమై వర్షంగా మారింది. అందరూ బోటు పై నుంచి దిగి లోనికి వచ్చేశారు. నేను మాత్రం ప్రకృతి అందాల మధ్య తడవటానికే నిశ్చయించుకుని అలాగే నిలబడి చుట్టూ చూస్తుండి పోయాను.
బోటు చివరివైపున ఒక యువతి తన భర్తో, మరెవరో కాని వారిస్తున్నా వినకుండా నాలాగే లోనికి వెళ్ళకుండా వర్షంలో తడుస్తూనే ప్రకృతిని ఆనందించటం చూసాను. ఆ అమ్మాయిని అలా చూస్తుంటే గీతాంజలి సినిమాలో పాట " వొళ్ళంత త్రుళ్ళింత కావాలిలే " గుర్తొచ్చింది.
పేరంటపల్లి దగ్గరకు వచ్చేసరికి వర్షం తగ్గి చిరు జల్లుగా మారింది. పేరంటపల్లిలో మాత్రం వర్షం పడలేదు కాబోలు నేల పొడిగానే ఉంది.
పేరంటపల్లి లో భూమిపైనే విస్తరించిన వేళ్ళతో ఒక మహా వృక్షం మనకు స్వాగతం చెప్తుంది. ఆ వేళ్ళ విలక్షణ అల్లిక, చూసే కళ్ళకు అనేక రూపాలను చూపిస్తుంది. ఆ వేళ్ళ మధ్య ఖాళీలు ఎంత పెద్దగా ఉన్నాయంటే, చిన్నపిల్లలు చాలా మంది వాటి మధ్య దూరిపోతూ ఆడుకోవచ్చు.
ఈ చెట్టు మన తెలుగు సినిమాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. "గోదావరి" ,
" ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" లాంటి సినిమాలలో ఈ వృక్షాన్నిచూడవచ్చు .
ఇక్కడ చెట్ల క్రింద గిరిజనులు వెదురుతో చేసిన హస్తకళలను అమ్ముతూ కనిపించారు. కొద్ది దూరంలోనే బాలానంద ఆశ్రమం కనిపించింది. దాని ప్రక్కగానే రాళ్ళ మధ్య పారుతున్న చిన్న జలపాతం ఉంది.ఆ నీళ్ళలో కాళ్ళు కడుక్కుని ఆశ్రమంలో ప్రతిష్టించిన శివలింగాన్ని దర్శించుకొని వచ్చాం . అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది.
అక్కడి నుంచి బోటు తిరుగు ప్రయాణం ప్రారంభించింది. బోటు లోనే కావలసిన తినుబండారాలు, పానీయాలు లభించాయి. చాలా త్వర త్వరగా పొద్దు వాలిపోతున్నట్లు అనిపించింది. చూస్తుండగానే సంధ్యాసమయం..రాత్రి గా మారి పోవటం ప్రారంభమైంది. కొండల మధ్య, మేఘాలను చీల్చు కుంటూ నీటిపై ప్రసరిస్తున్న సూర్యకిరణాలు అధ్బుత దృశ్యాలను ఆవిష్కరించాయి.
ఆ సూర్యాస్తమయం.. నదిలో మా ప్రయాణం, చలి గిలిగింతల మధ్య ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుండగా మా "పున్నమి" యాత్ర ముగిసింది.
చల్లని వాతావరణంలో చక్కని ప్రదేశం చూసిన ఆనందం మిగిలింది. అసలు సామాన్య ప్రకృతి కూడా శరత్ కాలంలో సుందరంగానే కనిపిస్తుంది. అంటే... సుందర దృశ్యాలు లేకపోయినా కూడ శరత్ కాలం దానంతట అదే సుందరంగా ఉంటుందని నా ఉద్దేశ్యం. మరి సహజంగానే సుందరమైన పాపి కొండలు ఈ కాలంలో ఇంకెంత సుందరంగా మారతాయో ఊహించండి. వీలైతే దర్శించండి.
15 comments:
చాలా బాగుందండి మీ పున్నమి యాత్ర..! పాపికొండల అందాలను మీ ఫోటోస్ ద్వారా బాగా చూపారు. ! ఒక చిన్న విన్నపం..మీ బ్లాగ్ URL అడ్రెస్స్‌లో మీ పొడిఅక్షరాలు ( GR) బ్లింక్ అవుతూ ఉండడం ప్రత్యేకంగా ఉన్నది..అలా ఎలా చేయగలిగారో దయచేసి తెలుపగలరా..??
సుందరమైన దృశ్యాలు!!
మీకు నా ధన్యవాదాలు.
చాలా బాగుందండి మీ ప్రయాణం. ఎప్పుడో వెళ్ళిన నా పాపికొండల ప్రయాణాన్ని మళ్ళీ గుర్తు చేసారు. ఎది ఎప్పటికీ మరువలేని ఒక చక్కని అనుభూతి.
కళ్ళతో చూసినట్టే ఉందండీ టపా చదువుతుంటే ....ఫోటోలూ బావున్నాయి.
nice and informative.
కమల్ గారూ,
మీకు నా ధన్యవాదాలు.
ఇక నా బ్లాగ్ URL లో నా పేరు (GR) గురించి...దీనిని Favicon అంటారు.నేను దీనిని ఈ సైట్ లో ఉంచిన Top rated favicons నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సైట్లోనే ఎలా change చేసుకోవాలో వివరంగా ఉంది. చూసి ఫాలో అవ్వటమే. ఇంకా ఇక్కడ కూడా చూడండి. మీకు ఉపయోగ పడుతుంది.
స్పందించిన మందాకిని , జయ , పరిమళం & మాధురి గార్లకు ,
ధన్యవాదాలు.
చాలా బాగున్నయండీ మీ వర్ణనలు..ఫొటోలు.నాకు గోదావరి సినిమా చూసినదగ్గరనించి ఒక కెమెరే వేసుకుని పాపికొండలకి వెల్లాలని కోరిక.కాని బోటు ప్రయాణం ప్రమాదం అది ఇది అని మా ఇంట్లో నా ఆటలు సాగలేదు.కాని నాకు పెళ్ళి అయింది రాజమండ్రి అబ్బయితో కాబట్టి ఈసారి నా పప్పులు ఉడుకుతాయి :)మీ పోస్ట్ చూసాక ఎట్టి పరిస్తితుల్లోను ఈసారి పాపికొండలు చూసేయాలి అనిపిస్తోంది....
Mee Paapikondala trip ni adhbhutanga vivarincharu. Simply superb. 4 years back memu vellina anubhutulnu chala baaga gurtu chesaru. Dhanyavaadaalu. Paapi kondalu ippativaraku chudanivaru ventane velli prakruti ante ide ani araadhinchi rammani manavi.
Ravindranadh garu inka vere pradeshalu kuda ee blog lo chupistarani ashistu...
Sarmavvs
ఇందు గారికి,
తప్పనిసరిగా చూడండి. మీ కళ్ళతో ( కెమెరాతో ) చూసిన అందాలను కొన్నిటిని మాకు కూడా పంచండి ( టపా రూపంలో ).
ధన్యవాదాలతో....
శర్మ గారికి,
వేరే ప్రదేశాలు దర్శించినపుడు, వాటిని గురించి ఈ బ్లాగ్ లో వ్రాసేందుకు తప్పనిసరిగా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
Very good pictures. Thanks for sharing them along with description. I wanted to visit this place next time when I come to India.
Bhaskar gaaru,
Visiting this place in spring season is better.
Thanks for the comment.
chala bagundi
me photos kanna me matalu chala bagunai
good
Post a Comment