Monday, August 10, 2009

సౌందర్యం - చలం

ఆనందించే గుణం హెచ్చిన కొద్దీ ఒక stage లో సౌందర్యం బాధ పెట్టడం ప్రారంభిస్తుందని అంటారు చలం మ్యూజింగ్స్ లో ఒక చోట.
దీనికి ఉదాహరణగా చేతుల్లేని వీనస్ విగ్రహాన్ని గంటల కొద్దీ , రోజుల కొద్దీ అట్లానే చూసి దీపం చుట్టూ కీటకాల లాగ తిరిగి , చివరికి పిచ్చెక్కిన రసికుల గురించి చెప్తారు. స్వయంగా తనకు కూడా ఆ విగ్రహాన్ని కంఠం నుంచీ తొడలదాకా చూసిన కొద్దీ పిచ్చెక్కినట్లవుతుందని వ్రాస్తారు. ఏమిటీ ఈ బాధ? అని తర్కించి తర్కించి చివరికి సౌందర్యంలోనే ఈ గుణం ఉందని తేల్చుకుంటారు.
ఈ సందర్భంలో ఆయన వ్రాసిన ,నాకు యిష్టమయిన వాక్యాలు.
"సౌందర్యంలో అశాంతిని కలిగించే శక్తిని గురించి ఆలోచించగా ఆలోచించగా ఏమనిపిస్తుందంటే , సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం వుందే, దాంట్లో సౌందర్యం నుంచి మనసుని, సౌందర్యాన్ని మించి వస్తువుకి సౌందర్యాన్ని కల్పించే శక్తి దగ్గరికి బాధ ద్వారా దృష్టిని మళ్ళించే ప్రయత్నం ఉందేమో? జీవ శక్తి మల్లేనే మనసు కూడా నిరంతరమూ evolve కావాలని సృష్టి ఉద్దేశ్యం అయి వుంటుంది. అందువల్లనే దేనిలోనూ తృప్తి పడక, వూరికే అశాశ్వతమై ఎప్పుడూ మారే ఆశలతో ఆరాటపడుతూ వుంటుంది మనసు."
ఇలా ఈయన రచన శైలి అక్కడక్కడ అర్ధం చేసుకోవటం కొంచం కష్టం అనిపించినప్పటికీ, తరువాత చాలా ఇష్టంగా మారుతుంది. మ్యూజింగ్స్ చదివిన కొత్తల్లో నాకు కొన్ని వాక్యాల్ని అర్ధం చేసుకోవటం కష్టమయ్యింది. సౌందర్యంలో బాధ, బాధలో సౌఖ్యం వగైరాలు వినటానికి చిత్రంగా అనిపించినా అసహజాలేమీ కాదు.
ఎంతటి క్లిష్టమైన భావాన్నైనా పదాలుగా మార్చి వాక్యాలుగా వ్రాయగలగటంలో ఈయనకు ఈయనే సాటి అని నా అభిప్రాయం. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే మ్యూజింగ్స్ ఎప్పుడూ నాకూడానే వుంటుంది.

2 comments:

భావన said...

నమస్తే. మంచి వాక్యాలు. చలం రాసిన ప్రతి వాక్యం ఆలోచిస్తూ వుంటె ఎన్నో అర్ధాలు గోచరిస్తాయి. చలం ని కలిసిన ఒక వ్యక్తి తో మాట్లాడుతుంటే ఆయన చెప్పేరు, ఆయనతో అదే అంటే అది మీరు కల్పించుకునే సృష్టేమో, "నాలో వుందంటారా ఆ గొప్పతనం అన్నారట". :-) నేను కూడా చలం అభిమానినే.

రవీంద్రనాధ్ గెడ్డం said...

నమస్తే భావన గారూ,
మీ బ్లాగులను చూస్తుంటే చలం పట్ల మీ అభిమానం ఎంతటిదో తెలుస్తోంది. మీ నుంచి మరిన్ని చలం విశేషాలను ఆశిస్తూ, ధన్యవాదాలతో..........