Sunday, July 05, 2009

మా ఊరిలో వధువుల కొరత

మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువై పోవటంవల్ల వధువుల కొరత ఏర్పడుతున్న విషయం,"పెళ్ళికాని ప్రసాద్ " లు పెరుగుతున్న విషయం అప్పుడప్పుడు మన చెవిన పడుతున్న విషయాలే. కాని ఈ పరిస్థితి అక్కడెక్కడో మాత్రమే కాదు మా ఉరిలో కూడా వచ్చిందని వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. నిన్న మా ప్రక్కవీధి లో ( పేర్రాజు చౌదరి కుమార్తె ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నది ) అబ్బాయి తండ్రి , అమ్మాయి తండ్రికి రూ.8౦,౦౦౦.౦౦ ముందే ఇచ్చేలా సంవత్సరం తరువాత పెళ్లి చేసేలా ఒప్పందం జరిగిందని తెలిసి వింతగా చెప్పుకుంటున్నారు.కట్నాల రేట్లు బాగా తగ్గాయని నాకు తెలుసు కానీ మరీ ఎలా ఎదురు డబ్బు తీసుకుని పెళ్లి చేసే రోజులొచ్చాయని తెలిసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. పరిస్థితులెంత వేగంగా మారిపోతున్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ముందు ముందు కన్యాశుల్కం రోజులు మళ్ళీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.

ఈ పరిస్థితులని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సంగతులు తెలుస్తున్నాయి.వరుల కోసం వెతుక్కునే పని పోయి వచ్చిన సంబందాలలో మంచివాటిని ఎంచుకొనే అవకాశం వీరికి వచ్చింది. పైగా వీరే మగపిల్లల తల్లిదండ్రులకి షరతులు పెడుతున్నారు. ఈ మధ్య ఒకాయన తన కుమార్తెకి సంబంధం కుదుర్చుకునేటప్పుడు, ఉమ్మడి కుటుంబంలోని కాబోయే అల్లుని వాటాకు వచ్చే ఆస్తులు వగైరా తెగ్గొట్టి అతనికి వచ్చే వాటిని అతని పేరు మీదకు మార్పిడి చేస్తేనే కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తానని షరతు పెట్టాడట. అలా చేసాకే పెళ్లి చేసాడని తెలిసింది.

పెళ్లీడు కొచ్చిన మగ పిల్లల తల్లిదండ్రులు మధ్యవర్తుల ద్వారా పైరవీలు నడుపుతూ ఆడపిల్లల తల్లిదండ్రులు తమవైపు వచ్చేలా చేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ మధ్య ఇంకో వార్తా ఏమిటంటే , కట్నం లేకుండా పెళ్లి అయిందని చెప్పుకోవటం నామోషి అనిపించి ఒకాయన తెరచాటున కొంత డబ్బు , బంగారం ముందుగానే అమ్మాయి తల్లిదండ్రులకి ఇచ్చి , వాటినే పబ్లిక్ లో బంధువుల మధ్య కట్నంగా తీసుకోవటం జరిగిందట.

మా ఊరిలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన యువకులే దాదాపుగా 3౦ ఏళ్ళు దాటిన వారు కనీసం 5౦ , 6౦ మంది ఉంటారు. అందరూ మధ్య తరగతి స్థాయి నుండి సంపన్నుల స్థాయికి చెందినవారే. కాని అమ్మాయిలు 25 సం. దాటిన వారు 5 ,6 గురు కూడా లేరు. దీనిని బట్టి వధువుల కొరత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నా స్నేహితుడు ఒకడు మాటల సందర్భంలో " నేను చిన్నవాడైనా మా అమ్మాయి పెళ్లి కంటే ముందు అబ్బాయి పెళ్లి చేస్తా, ఎందుకంటే ముందే అమ్మాయి పెళ్లి చేసేస్తే ఇంక మా అబ్బాయి మొహం చూసే వారుండరేమో కదా ! అమ్మాయిని అడ్డం పెట్టుకుని అబ్బాయి పెళ్లి కానిస్తే తరువాత అమ్మాయి పెళ్లి ఎలా అయినా చేసెయ్యొచ్చు లేదా కుండ మార్పిళ్లు ట్రై చెయ్యొచ్చు " అన్నాడు. ఇంతవరకు ఇంట్లో ఉన్న ఆడపిల్ల చిన్నదైనా పెద్దదైనా ముందు పెళ్లి చేసేసి రిలీఫ్ ఫీలయ్యి తరువాత తాపీగా అబ్బాయి పెళ్లి చేయటం చూస్తున్నాం. ఇక ముందు కుటుంబంలో మగపిల్లవాడికి ముందు పెళ్లి చేసేసి గుండెల మీద కుంపటి తొలగించు కుంటారన్నమాట.

ఏమైనా ఆడపిల్లల పట్ల వివక్ష పూర్తిగా తొలగి ఆడపిల్లల సంఖ్య మగవారి సంఖ్య తో సమానమైతే తప్ప ఈ పరిస్థితి మారదు. అప్పుడు మాత్రమే సమాజం కన్యాశుల్కం నుంచి వరకట్నం లోకి, వరకట్నం లోంచి కన్యాశుల్కం లోకి మారటం కాకుండా ఈ రెండు లేని స్థితి దగ్గర ఆగుతుందని నా ఉద్దేశ్యం.

3 comments:

KAPALI said...

Good one.

నీహారిక said...

నిజమే నండీ మా బంధువుల్లో కనీసం 10 మంది అబ్బాయిలు పెళ్ళి కాకుండా ఉన్నారు. అందరూ software engineer లే ఇపుడు software అంటేనే పిల్లనివ్వడం లేదు.

mohanraokotari said...

nenu namma ledu kaani nijame nanna maata, software boom collapse valla anukunnanu gaani nijamaite baguntundi.