రామసీత అని మా చెల్లెలి క్లాస్ మేట్ ఒక ఆవిడ (నాకు కూడా స్నేహితురాలే) ఇవాళ మా ఇంటికి వచ్చింది.కొన్నాళ్ళ క్రితం తనకు బాగా జబ్బు చేసింది.రెండు కిడ్నీలూ పాడయిపోయాయి.బ్రతకటం కష్టం అన్నారు డాక్టర్లు. అల్లాంటిది వాళ్ళ అక్క ఒక కిడ్నీ ఇవ్వటంతో బ్రతికింది. ఈ విషయం తెలిసిన తరువాత ఒకరోజు తన ఇంటికి పరామర్శ కని వెళ్ళాను. కాని తను వాళ్ళ అత్తగారి వూరు వెళ్ళటంతో కలవలేకపోయాను. తనే ఇవ్వాళ మా ఇంటికి వచ్చింది.
పరామర్శలో భాగంగా తనకు కలిగిన అనారోగ్యం గురించి అడిగాను. అన్నీ వివరంగా చెప్పింది.
తను చెప్పిన మాటలను బట్టి , మొదట్లోనే కనిపించిన అనారోగ్య లక్షణాలని సరిగా గుర్తించలేక తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదేమో అనిపించింది నాకు. డాక్టర్లు కూడా మొదట్లో ఇంతటి ఉపద్రవాన్ని వూహించలేకపోయారనే చెప్పొచ్చు. ఏమైతేనేం 2 కిడ్నీలూ పాడయిపోయాయి అని చెప్పారట. చివరకు ఎవరైనా రక్త సంబందీకులు కిడ్నీ ఇస్తే తప్ప బ్రతకదని డాక్టర్లు తేల్చారట. అందాక డయాలసిస్ తో బ్రతకాలన్నారట . ఆ పరిస్థితుల్లో తన ఇద్దరు అక్కలు నేను , నేనంటూ కిడ్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చారట. చివరకు అనేక ఇబ్బందులు (బ్లడ్ గ్రూప్ సరిపోలక ఒక అక్కనీ , షుగర్ వ్యాధి ఉండటం వల్ల ఒక అక్కనీ డాక్టర్లు నిరాకరించటం , బ్రోకర్ల ద్వారా కిడ్నీ కోసం ప్రయత్నించి మోసపోవటం వగైరా)ఎదుర్కున్న తరువాత మరొక అక్క కిడ్నీ ని తీసి తనకు అమర్చి బ్రతికించారట.
ఈ మొత్తం ఉదంతం సుమారుగా 7,8 నెలలు నడిచింది. ఈ క్రమంలో 3,4 సార్లు ఇక లాభం లేదు ,పేషంటు బ్రతకటం కష్టం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని కూడా డాక్టర్లు అన్న సందర్భాలు వచ్చాయట. లక్షలకొద్దీ డబ్బు ఖర్చు అయిపోయిందట.
నేనప్పుడు అడిగా అంతటి నిరాశాపూరిత పరిస్థితినెలా ఎదుర్కొన్నావు? అప్పటి నీ మానసిక స్థితి ఎలా వుందీ? ఆ బాధని ఎలా తట్టుకున్నావు? అని.
అపుడు , ఇంటర్ చదివే రోజులలో తను కలిసిన జ్యోతిష్కుని గురించి, అతను చెప్పిన జాతకం గురించీ చెప్పింది. ఆ జ్యోతిష్కుడు తన చేయిని చూసి , నీకు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.ఎవరికీ బ్రతుకుతావని ఆశ లేకుండా పోతుంది. కాని పొట్టకు పెద్ద శస్త్ర చికిత్స చేస్తారు. చికిత్స విజయవంతమవుతుంది.నువ్వు బ్రతుకుతావు. జీవితాంతం నీబాధ్యతలు నెరవేరుస్తావు అని చెప్పాడట. ఆ జ్యోతిష్కుని మాటలు తనకు టానిక్ లా పని చేసాయని తను తప్పనిసరిగా బ్రతుకుతానని నమ్మకంతోనే చివరిదాకా వున్నానని చెప్పింది. అలానే బ్రతికింది.
ఏమైతేనేం వైద్యం వల్ల బ్రతికిందో , జాతకమ్మీద తనకున్న విశ్వాసమే తనను బ్రతికిచిందో మొత్తం మీద బ్రతికింది. జ్యోతిష్కుని మాటలు నిజమయ్యాయి.
ఇదొక్కటే కాదు గతంలో కూడా జాతకం నిజమైన సందర్భాలు 2,3 ఎరుగుదును. చాలా సార్లు నిజం కాకపోవటాన్ని కూడా చూశాను. ఎన్నోసార్లు నిజం కాకపోవటమనేది ఒకసారి నిజం కావటం లోని సత్యాన్ని తీసివేయలేదు కదా!. ఇలాంటి సందర్భాలలోనే జాతకాలని నమ్మం అని వాదించే బదులు , అవును జాతకాలు అప్పుడప్పుడూ నిజమవుతూ ఉంటాయి, భవిష్యత్తును తెలుసుకొనే శక్తి కొంతమందికి ఉంటుంది అని ఒప్పుకోవటమే మంచిదని అనిపిస్తుంది నాకు.
ఈ మొత్తం ఉదంతంలో నన్ను కదిలించిన మరో అంశం అక్క చెల్లెళ్ళ మధ్య అనురాగం. తమ తమ భర్తల అనుమతి లేదనో మరోటో చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా తన అక్కలందరూ అలాంటిదేమీ చేయకుండా కిడ్నీ ఇవ్వటానికి సంసిద్దత తెలిపి మెడికల్ టెస్ట్ లకు హాజరు కావటం నిజంగా నన్ను కదిలించింది.
Monday, April 06, 2009
స్నేహితురాలి జాతకం
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment