తమకు తోచిందీ,నమ్మేదీ తప్ప మరొకరేం చెప్పినా వినని వారు కొందరుంటారు. మా ఫ్రెండ్ ఒకడికి హోమియోపతి మీద అసలు నమ్మకం లేదు. ఎందుకో తెలియదు కానీ ఈ విధానం ద్వారా ఏ జబ్బూ తగ్గే పనే వుండదు అంటూ వాదిస్తూ ఉంటాడు.హోమియోపతితో తనకు ఏమన్నా చేదు అనుభవం ఉందేమో అందుకే ఈ అభిప్రాయానికి వచ్చాడేమో అనుకున్నా. అలాంటిదేమీ లేదని తెలిసింది. సరైన కారణం లేకుండానే కొన్నిటి మీద సదభిప్రాయం మరికొన్నిటిమీద దురభిప్రాయం కలగటం సహజంగా జరిగేదే కదా. అలాగే వీడికి హోమియోపతి మీద దురభిప్రాయం కలిగి ఉంటుంది. సరిగా వివరించి చెబితే తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడేమో అనిపించి ఈ మధ్య ఒకసారి ప్రయత్నించి చూశాను.
హోమియోపతి పితామహుడు "డాక్టర్ హానిమన్ " కన్నా ముందే అల్లోపతి కి కూడా ఆద్యుడైన " హిప్పోక్రటిస్ " హోమియోపతి మూలసూత్రమైన " సరూపాలతో సరూపాలను నివారించాలి " అనేవిషయాన్ని కనిపెట్టాడనీ , ఏ పదార్ధమైతే స్థూలమొత్తం లో తీసుకొంటే రోగాలను కలిగిస్తుందో అదే పదార్ధం సూక్ష్మ మోతాదులో తీసుకుంటే అలాంటి రోగాన్ని తగ్గిస్తుందనీ,శక్తి గుణీకరణ(పొటంటైజేషన్ ) విధానం ద్వారా మందులు తయారవుతాయనీ , మందులు చాలా శక్తివంతంగా పని చేస్తాయనీ ఎంతో ఓపికగా వివరించి చెప్పాను. ఎంత చెప్పినా,విని అంతా ట్రాష్ వాటిల్లో పంచదార, ఆల్కహాల్ తప్ప ఇంకేంవుండదు.చాలెంజ్ అన్నాడు.
అమ్మకి అల్లోపతి లో తగ్గని సైనసైటిస్ హోమియో వల్లే తగ్గింది అని చెప్తే ఆ.. దానికదే ఆ సమయానికి తగ్గి ఉంటుంది అన్నాడు. టీచర్ గారి కీళ్ళ నొప్పి కూడా హోమియో వల్లే తగ్గింది కదామరి అంటే, గాడిద గుడ్డు అది అంతకు ముందు వేసుకున్న అల్లోపతి టాబ్లెట్ ల కారణంగా తగ్గి ఉంటుందిలే పో అన్నాడు.
వీడి వరస చూస్తుంటే ఎవరైనా ఏ బెల్లం ముక్కో నోట్లో వేసుకుని తియ్యగా ఉందని చెప్తే , ఆతీపి బెల్లానిది కాదు నిన్న త్రాగిన చెరుకురసానిది అని కాని,తియ్యగా వుంది అని గట్టిగా పదే పదే అనుకున్నావు కాబట్టీ అలా అనిపించింది అని కాని అనగల సమర్ధుడనిపించింది.
ఇంక చేసే దేముంది? జాగ్రత్తగా సంభాషణను ముగించి , మనసులోనే లెంపలు వేసుకుని లేచి వచ్చేశాను.
.చిన్నప్పట్నుంచీ ఏదో ఒక అభిప్రాయంతో , నమ్మకంతో వుండిపోయి, దానిలో తృప్తిని పొందుతున్నంతసేపూ ఎంత చెప్పి, వాదించి కూడా వారిని దానికి విరుద్ధమైన అభిప్రాయంలోకి మార్చలేమని ఇలాంటి వారిని చూసి తెలుసుకోవచ్చు.
Sunday, April 06, 2008
Subscribe to:
Posts (Atom)


