Tuesday, February 26, 2008

నా ఉదయపు నడక

పొద్దున్నే నడవటం మానేసి చాలా రోజులయ్యింది. మళ్ళీ మొదలు పెట్టకపోతే ఇదో బెంగ కింద మారిపోయే అవకాశం వుంది. శీతాకాలం కావటం , చలి ఎక్కువ అవటం వలన పొద్దున్నే లేవటానికి బద్దకం ఎక్కువై నడక మానేశాను. ఇంట్లో కూడా మాటొచ్చేసే అవకాశం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇక సాకులు చెప్తే బాగోదు కాబట్టి నడక మొదలు పెడదామని నిశ్చయించుకొన్నాను. ఇలా తెల్లవారక ముందే లేవటం , నిద్రతో స్వాధీనం తప్పిన శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని బయల్దేరటం అంటే కొంచం కష్టమైన పనే. అయినా సరే కష్టమ్మీద తెల్లవారఝామునే లేచి, తయారై బయటపడ్డాను .

రోడ్డెక్కాక , అలికిడి వినపడిందో ఏమో ముగ్గేసుకుంటున్న ప్రక్క ఇంటావిడ తల పై కెత్తి చూసి మళ్ళీ వంగింది. "మళ్ళీ మొదలుపెట్టినట్లున్నాడు నడక , ఈసారి ఎన్నాళ్ళు చేస్తాడో?" అని అనుకుంటూ వుండవచ్చు బహుశా.

ఉప్పుగుంట గట్టుమీద కొచ్చేసరికి అప్పటికే హోటళ్ళు తెరిచేశారు . తెల్లారకపోయినా మనుష్య సంచారం బాగానే వుంది. రాత్రి త్రాగిన మద్యం మత్తు దిగిపోవటం వల్ల వచ్చే హాంగోవర్ ఇబ్బందులతో కాబోలు మందుబాబులు అప్పటికే సెంటరు కొచ్చేశారు, అన్వేషణ నిండిన కళ్ళతో .

ఎప్పుడూ నడిచే కలవలపల్లి రోడ్డు వైపుకి తిరిగా. కొంచంసేపటికే వీధిలైట్లను దాటేశాను. నేను మాత్రమే రోడ్డుపై మిగిలాను. ఎదురుగా ఎవరో నడుస్తున్న అలికిడి వినపడింది. నడక వేగం కొంచం పెంచి దగ్గరకెళ్ళాక చూస్తే ఆయన ఎవరో, చేతి లో చెంబుతో పరుగు లాంటి నడక తో నడుస్తున్నాడు. ప్రకృతి పిలుపు అంత బలంగా వుందన్నమాట .

కోళ్ళఫారం దగ్గరైంది. వాసన భరించలేక , వూపిరి బిగబట్టి నడక వేగం మరింత పెంచా. ఇక ఈవేగం తిరిగి ఇంటి కెళ్ళేదాకా తగ్గించకూడదని నిర్ణయించుకున్నా. చెమట వల్ల వీపుమీద చొక్కా తడవటం మొదలయ్యింది.

నాప చెరువు కు దగ్గరయ్యాను. మూడు కుక్కలూ గట్టు మీద ఎప్పటిలాగే ముణగదీసుకుని పడుకున్నాయి. నా అడుగుల చప్పుడుకి మెళకువ తెచ్చుకున్న మచ్చలకుక్క భౌ ....మంది.నల్లకుక్క మాత్రం నన్ను గుర్తు పట్టి, పడుకునే అడ్డంగా వూపుతున్న తన తోకను చూపించింది. "ఇదెప్పుడూ అంతే, కంగారెక్కువ, నువ్వేం భయపడకు " అని చెప్పాలని దీని వుద్దేశం కాబోలు .ఇంతకూ, ఊరికి ఇంత దూరంగా వున్న చెరువు దగ్గరకు ఇవి ఎందుకొస్తున్నాయో ఏమో! బహుశా ఇక్కడకు దగ్గరగా ఉన్న ఎవరి మకాంలోనైనా ఉంటున్నాయేమో మరి.

నాపచెరువు మూలదాకా నడచి, అక్కడ నుంచి వెనక్కు మళ్ళాను. అప్పుడప్పుడే తెల్లవారటం మొదలయ్యింది. వూరికి దగ్గరయ్యే కొలదీ గరువుకీ, చేలకీ వెళ్ళే వాళ్ళు ఎదురవటం మొదలయ్యింది. పరిచయం వున్నవారికోసం పలకరింపు నవ్వు మొహాన అలంకరించుకున్నాను. చెమటతో చొక్కా మూడు వంతులు తడిసి పోయింది. ఇంతలో తాడిచెట్ల వరుస దగ్గరయ్యింది. వచ్చేటపుడు చీకటి వల్లా, మంచువల్లా సరిగా కనపడలేదు కానీ, ఇపుడు తిరిగి వెళ్తుంటే బాగానే కనపడుతున్నాయి.రోడ్డు పక్క చేను గట్టు మీద రోడ్డుకి సమాంతరంగా వున్న ఈ తాడిచెట్ల వరుసను చూస్తుంటే, సైనిక వందనం చేస్తున్న సైన్యం గుర్తుకొస్తుంది నాకు. పోయేదేముంది? ఆ వందనాన్ని నేనే స్వీకరిస్తా.

ఇంటికొచ్చి టైం చూశాను. నాలుగు కి.మీ. నడక కు ఖచ్చితంగా నలభై నిమిషాలు పట్టింది. "ఫరవాలేదు ఫాం లోనే వున్నాను" అనుకున్నాను .చొక్కా విప్పి ఫాను కింద కూర్చుంటే ఎంతో హాయిగా వుంది. నడవటానికి లేవటం ఎంతో కష్టమను కుంటాం కాని నడిచి వచ్చింతరువాత వచ్చే హాయి దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువ.

ఇక నుంచి నడక మానకూడదని గట్టిగా సంకల్పించుకున్నాను (ఎప్పటి మాదిరిగానే ! ).

4 comments:

ప్రవీణ్ గార్లపాటి said...

బాగుంది మీ నడక ప్రహసనం...
నేను ఖచ్చితంగా లేవలేను పొద్దున్న్. అందుకనే నా ఎక్సర్సైజులన్నీ సాయంత్రమే.

రవీంద్రనాధ్ గెడ్డం said...

ప్రవీణ్ గారికి,
నెనర్లు. ఉదయపు ఎక్సర్ సైజ్ వల్ల వచ్చే ఉత్సాహం మనల్ని రోజంతా కాస్తుంది.

రమ్య said...

నాకిష్టమైన వాటిల్లో ఉదయాన్నే నడవటం ఒకటి.

రవీంద్రనాధ్ గెడ్డం said...

మీ నడక నిరంతరాయంగా కొనసాగాలని కోరుతూ.....


Blogspot Templates by Isnaini Dot Com and Insurance News. Powered by Blogger