Thursday, January 31, 2008

వ్యక్తులలో లోపాలు

కొంతమంది వ్యక్తులలో , వారి వారి రంగాలలో ప్రతిభావంతులైనవారిలో కూడా కొన్ని లోపాలు తరచూ కనపడుతూవుంటాయి. ఆ లోపాల్లో అబద్దాలాడటం ఒకటి. ఇలాంటివారు ఇతర్లని సంతోషపెట్టే నిమిత్తమూ ,వారి పట్ల తమకు వున్న ఆపేక్షను తెలియజేసే నిమిత్తమూ అబద్దాలు ఆడేస్తుంటారు. ఇలాంటి అబద్దాల వల్ల ఎటువంటి ప్రమాదాలు వుండవనుకోండి.
ఉదాహరణకి దగ్గర బంధువు ఒకడు నగరంలో నివశిస్తున్నాడు. స్వంత వ్యాపారంలో బాగానే స్థిరపడ్డాడు. ఏదైనా పని
అప్పగిస్తే అది చిన్నదా ?పెద్దదా? అని చూడకుండా నాలాంటివారికి బాగానే చేసి పెడతాడు.
ఈ మధ్య నగరంలో వాడూ నేనూ కలుసుకోవటం తటస్థించింది. వెంటనే ఏరా ! బాగున్నావా? ఎప్పుడొచ్చావు సిటీ కి? ఈ మధ్య అసలు కనపడ్డం లేదు ,ఫోన్ లోనూ దొరకట్లేదు? ఈమధ్య 2,3 సార్లు ట్రై చేసాను నీకోసం అన్నాడు. అంతేకాక, నీకు పంపిన పుస్తకం అందిందా? ఇంతకూ ఎక్కడ దిగావు? ఫోన్ చేస్తే నేను స్టేషన్ కి వచ్చేవాడిని కదా! అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎంతో ఆప్యాయత కురిపించాడు. నేను మాత్రం ఆశ్చర్య పోయాను. వాడి నుంచి నాకే పుస్తకం అందలేదు సరికదా అందలేదని చెప్తే అందలేదా! ఫలానా రోజున కొరియర్లో పంపానే అన్నాడు ఇక ఫోన్ విషయం కొస్తే , నిజానికి వాడితోనే మాట్లాడటానికి 2,3 సార్లుప్రయత్నించింది నేను. సరే వాదన లోనికి పోకుండా నేను కూడా కుశల ప్రశ్నలు వేశాను. వాడు సరేరా? ఇంతకూ రేపు మధ్యాహ్నం నువ్వు ఖాళీయేనా? ఎక్కడ ఉంటావ్ ? అని వివరాలు వాకబు చేశాడు. తరువాత రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లోనే ఉంటావ్ కాబట్టి నేను వచ్చి నీతో కొంతసేపు గడుపుతాను. నీతో మాట్లాడి చాలా రోజులయ్యింది. సరదాగా గడుపుదాము అన్నాడు
మర్నాడు మధ్యాహ్నం వాడి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నా. 1 గంట కాదు 2 కాదు 3 అయినా వాడు రాలేదు . కనీసం ఫోన్ అయినా చెయ్యలేదు. తరువాత ఎప్పుడో కనపడి , ఫలానా రోజున మధ్యాహ్నం నీ కోసం వచ్చాను ఎక్కడకు పోయావ్ రా కనపడకుండా? అని అడిగినా అడగగలడు వీడు.
వీడి మనస్తత్వమేమిటా అని ఆలోచించి చూస్తే , నాకేమనిపిస్తుందంటే వీడే కాదు, వీడిలాంటి వారందరూ కావాలని అబద్దాలు చెప్పరు. వీరి కప్పగించిన పనులైతే బాగానే చేస్తారు కాని చిన్న చిన్న విషయాలు మాత్రం గుర్తుంచుకోరు. ఆ మాటలు చెప్పేటప్పుడు నిజంగా చేద్దామనే
చెప్తారు. కాని వారికున్న పనుల వత్తిడిలో మర్చి పోతారు. తరువాత విషయం చెప్పి తమ అశక్తతను తెలియజెప్పే బదులు అబద్దాలు ఆడేస్తారు. ఇలాంటి వారిని మనమే సహృదయం తో అర్ధం చేసుకోవాలి. వారికి మన పట్ల వున్న అపేక్షనే గుర్తించాలి తప్ప ఇలాంటి లోపాలని కాదు.

2 comments:

రాధిక said...

బాగా చెప్పారు.ఇలాంటి అబధ్ధాల వల్ల ప్రమాదమేమీ లేదు గానీ నిజాలు తెలిసాకా అవతలి వ్యక్తి మీద కొద్దిగా గౌరవం తగ్గడం మాత్రం జరుగుతుంది

రవీంద్రనాధ్ గెడ్డం said...

రాధిక గారికి,
నెనర్లు.
మనం కూడా వీలైతే లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి.