మనలో ప్రతి ఒక్కరికీ "భయం " గురించి అనుభవమే. జీవితం లో ఏదో ఒక విషయాన్ని గురించి భయపడనివారు ఉండరు. భయపెట్టే విషయాలు మనిషి మనిషికీ వేరు వేరుగా ఉన్నా , అందరినీ భయపెట్టే విషయం గా మాత్రం మరణం గురించి చెప్పవచ్చు . మరణభయం లేనివారు చాలా అరుదుగా ఉంటారు.
మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను ( కూడ బెట్టుకున్న జ్ణాపకాలు , అనుభవాలు , అభిప్రాయాలు వగైరా) మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది . మరణం తరువాత మనం ఏమవుతాం ? అనే ప్రశ్నకు నమ్మకమైన సమాధానం లేకపోవటం కూడా మనలో భయానికి మరో కారణం .
మరణం పట్ల మన భయం పోవాలంటే మనలో చాలామందికి మరణం తరువాత ఏదోవిధంగా అంటే సూక్ష్మ దేహమనో , మరోజన్మ అనో ఏదో పేరుతో కొనసాగుతామని నమ్మకం కుదరాలి లేదా కనీసం మరణం తరువాత ఏమవుతుంది? అనే విషయం తెలియాలి . అంటే జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో తెలియాలి . అపుడు చావు భయం చాలా తగ్గుతుంది .
చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి . వాటిద్వారా మనం అందరికీ తెలిసున్న జీవితపు ఈవలి వొడ్డు నుండి ఉందని నమ్ముతున్న మరణం తరువాతి ఆవలి వొడ్డుకు వారధి నిర్మించుకుంటాం . ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం .
కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు. ఈ ప్రపంచం మొత్తంలో అన్నీ అశాశ్వతమే అయినపుడు మనం మాత్రం శాశ్వతం ఎలా అవుతాం ? అని ప్రశ్నించటమే కాక ఆయన శాశ్వతంగా ఉండటం అనే దానిలో ఉండే అవలక్షణాన్ని కూడా వివరిస్తాడు .
శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. అలా ఏ కొత్తదనమూ లేకుండా ఎంత కాలం కొనసాగితే మాత్రం ఏమి లాభం ? అంటాడాయన . కొనసాగటం ఆగినపుడే కదా కొత్తదేదైనా ప్రవేశించటం సాధ్యపడేది? పాత విషయాలకు సంబంధించి మనం మరణిస్తే తప్ప కొత్తవీ , సృజనాత్మకమైనవీ ఏవీ మనలోనికి చేరవు. కాబట్టి మనం అంతం కావటానికి భయపడకూడదు . శాశ్వతత్వం మీద ఇష్టాన్ని ఎవరు చంపు కుంటారో వారికి మరణం పట్ల భయం ఉండదు .
సరే , ఇక జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలమా? అనే ప్రశ్నకు జె. కె. గారు తెలుసుకోగలమనే చెబుతారు. మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది . అలా చేయగలవారు మాత్రమే జీవించి ఉండగా మరణాన్ని తెలుసుకోగలరు అంటారాయన.
ఇలా మన నమ్మకాలు , జ్ణాపకాలు , అనుబంధాలతో కూడిన నేపధ్యం మొత్తాన్ని అంతం చేయటం అంటే , ధ్యానం , సమాధి మొదలైన యోగ ప్రక్రియలలో చెప్పబడే మనసుని అదుపు చేయటం , శూన్య పరచటం లాంటిదన్నమాట . అపుడు మాత్రమే మనలోనికి కొత్తదీ , సృజనాత్మకమైనదీ , సత్యం , దైవం మరేదైనా అనండి అది ప్రవేశించటానికి ఆస్కారముంటుంది . అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు దీనిని సాధించే నిమిత్తం ఎవరికీ ఏ ప్రక్రియనీ సూచించరు . ఎవరికి వారు తమ స్వంత మార్గాన్ని అన్వేషించుకోవలసిందే అంటారాయన .
Sunday, November 25, 2007
జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం
Labels: ఆధ్యాత్మికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:02 PM 7 comments
Saturday, November 17, 2007
ధ్యానం యొక్క అత్యున్నత లక్ష్యం
సాధారణంగా ప్రతీ మనిషికీ తను ఉండే నిద్రావస్థ, జాగృదావస్థ ల గురించే తెలుస్తాయి. ఉదయాన్నే మేలుకోవటమే జాగృదావస్థ లోనికి వస్తాడు. రాత్రి నిద్ర పోతూ నిద్రావస్థ లోనికి పోతాడు. ఈ రెండు స్థితులు తప్ప మరోఅవస్థ గురించి తెలియదు.కాని అధ్యాత్మికవాదులు మరో అవస్థ గురించి కూడా చెబుతారు.అదే దైవీ అవస్థ. దీనినే అనంతదైవీ చైతన్యమనీ, అతీత చైతన్య స్థితీ అనీ రకరకాలుగా వర్ణిస్తారు.ఈ అవస్థ పరం గా మనమందరం ఇంకా నిద్రిస్తున్నట్లే లెక్క. ఒకవేళ ఎవరైనా ఈ స్థితి లోనికి మేలుకోవటం జరిగితే ( జ్ణాన నేత్రం తెరుచుకున్నట్లయితే ) వారికి తనే దేవుడిని అనే స్పృహ కలుగుతుంది. అంతవరకూ తను గడిపిన జీవితం అంతా నిద్ర లాంటిదని తెలుసుకుంటాడు. తన యొక్క అసలు స్వరూపం ఇదే ( పరమాత్మ ) అనీ , విశ్వమంతా తానై ఉన్నాననే నిజాన్ని తెలుసు కుంటాడు. ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. ఈ స్థితిలోనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. దీనిని ఎవరూ మాటలలో వర్ణించ లేరు, ఎందుకంటే ఇది మనసు పరిధిని దాటి ఉంటుంది కనుకనే దీనిని ఎవరికి వారు తమ అనుభవంలో తెలుసుకోవలసిందే.
తన స్వరూపమే ఆనంద స్వరూపమనీ , తనకు వేరుగా దేవుడు ఎక్కడో లేడనీ తనే దేవుడుననీ తెలుసు కోవటమే ప్రతీ మనిషి లక్ష్యం. ఈవిషయం ఎవరికి తెలిసినా , ఎవరికి తెలియకపోయినా అందరి ప్రయాణం అటే.ఈ జన్మ లో కావచ్చు లేదా మరికొన్ని జన్మల తరువాతైనా కావచ్చు. ఆలక్ష్యాన్ని చేరుకోవలసిందే.
ఆ స్థితిని ప్రయత్నంతో అనుభవం లోనికి తెచ్చుకోవాలంటే చపలమైన చిత్తానికి కళ్ళెం వేయాలి. మనసుని నిశ్చలం చేయాలి. లక్ష్యాన్ని ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనలోదైవ ప్రకాశం పొందటం కోసం అడ్డుగా వున్న మనసు అనే తెరను తొలగించాలి. ఇవన్నీ ధ్యాన యోగం తో సాధ్యపడతాయి. మన ప్రాచీన మహర్షులు ఆత్మసాక్షాత్కారం కోసం ధ్యాన యోగమే కాక ఇంకా భక్తి యోగమనీ, కర్మ యోగమనీ , రాజ యోగమనీ ఇంకా ఎన్నో మార్గాలు చెప్పారు. అన్ని మతాల సారమూ ఈస్థితి లోనికి మేలుకొమ్మనే .
దైవ సాక్షాత్కారమనేది మనిషి చేసే కృషిని బట్టి ఉంటుంది. ఈ విషయమ్మీదే దృష్టినంతా ఏకాగ్రపరచి కఠోర ధ్యానం ( తపస్సు ) తో గడపితే చాలా త్వరగానే భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు . లేదా చిత్త శుద్ది కరవైతే కొన్ని జన్మలే ఈ ప్రయత్నం లో ఖర్చయిపోవచ్చు.
ధ్యానం , సమాధి వగైరా ఆధ్యాత్మిక సాధనల వల్ల బి పి , అల్సర్లూ , టెన్షన్ లూ తగ్గుతాయనీ , మెదడు చురుకుదనం పెరుగుతుందనీ , అయిడియాలు బాగా వస్తాయని ఇలా చాలా చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తిస్తున్నారు. కానీ ధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని తెలుసుకోవాలి. ఆచరించాలి.
Labels: ఆధ్యాత్మికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 9:28 PM 2 comments
Sunday, November 11, 2007
గురజాడ గారి "పెద్ద మసీదు"
"కన్యాశుల్కం " రచయితగా గురజాడ అప్పారావు గారి గురించి తెలియని వారు ఉండకపోవచ్చు . ఆయన కేవలం కొన్ని నాటకాలు వ్రాయటానికే పరిమితం కాలేదు . కొన్ని కధానికలు కూడా వ్రాశారు . ఈ విషయం కొంత మందికి తెలియదు . అయితే అవి అముద్రితాలు. ఆయన చనిపోయిన తరువాత ఆయన వ్రాసుకున్న డైరీ లు , వ్రాత ప్రతులూ , కాగితాలలో బయటపడిన , ముద్రణ కోసం సిద్దం చేసుకున్నట్టు గా ఉన్న , వేళ్ళ తో లెక్కించగల్గిన కొన్ని కధలలో ఈ "పెద్ద మసీదు" కధ ఒకటి.ఆయన వ్రాసుకున్న ఊహలూ , ఆలోచనలలో అనేక కధలకు సరిపడే ముడి సరుకు ఉంది . ఇంకొంత కాలం బ్రతికి ఉంటే అవన్నీ ఎన్నో మంచి కధలుగా రూపు దిద్దుకుని ఉండేవి .
ఈ "పెద్ద మసీదు" కధని చదివిన కొందరు అసంపూర్తి రచన అనీ , ఇంకా వ్రాయవలసింది ఉండి ఉండవచ్చు అనీ అభిప్రాయపడ్డారట .ఇంతకూ కధ ఏమిటంటే ఒక పండితుడు ఉంటాడు. చాలా ఏళ్ళు కాశీ లో గడిపి ఒక శిష్యుడు తో స్వగ్రామం వస్తాడు . దూరం నుంచే కనపడే ఆ గ్రామ దేవాలయ గోపురం కనపడక పోయేసరికి కంగారు పడతాడు . అ స్థానంలో ఓ పెద్ద మసీదు గోపురం కనపడుతుంది . ఆశ్చర్యం నుండి తేరుకుని మశీదు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ఇమాం ను సంప్రదిస్తారు . ఆ ఇమాం బండగా , ముక్తసరిగా కసిరినట్లుగా మాట్లాడుతాడు . చాలా బాధ కలిగిన పండితుడు వెనక్కు పోదామని నిర్ణయించుకుంటాడు . కానీ శిష్యుడు వారించి కనీసం ఆవీధి లోనే ఉండే తమ బంధువుల వివరాలైనా తెలుసుకోమని సలహాచెప్తాడు. సరేనని తమాయించుకుని ఇమాం ద్వారా బంధువుల విచారణ చేస్తాడు . తద్వారా ఈ ఇమాం తన మేనల్లుడే అని తెలుసుకుంటాడు . ఇద్దరూ ఆనంద పరవశులై పరస్పరం కౌగలించుకుంటారు .
ఈ కధానిక చదివిన తరువాత ఏమాత్రం బుర్ర ఉన్న వాడైనా అసంపూర్ణం అనగలడని అనుకోను . ఏ కాలానికైనా అంతర్జాతీయ కధానికా సంకలనాల కెక్కాల్సిన స్థాయి దీనిది . ఇంతటి శక్తి వంతమైన కధని ఆయన కేవలం 500 లోపు పదాలలో , అదీ సుమారు 100 సంవత్సరాల క్రితం వ్రాశారు. మతం కన్నా రక్తసంబంధం గొప్పదనే సందేశాన్ని మనసుకి హత్తుకునేలా చెప్పారు . ఈ కధకి ఒక్క వాక్యం కలిపినా , కనీసం ఒక పదం కలిపినా కధ పాడవుతుందేమో అనిపిస్తుంది.
సాహిత్య అకాడమీ వారు భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించిన శ్రేణిలో నార్ల వెంకటేశ్వర రావు గారు ఆంగ్లంలో వ్రాసిన
"గురజాడ"అనే పుస్తకం లో అప్పారావు గారి అముద్రిత రచనల (డైరీలు , వ్రాతప్రతులు వగైరా ) గురించి చదవవచ్చు. దీనిని కేతు విశ్వనాధ రెడ్డి గారు అదే పేరుతో తెలుగు లోనికి అనువదించారు .
Labels: సాహిత్యము
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:49 PM 0 comments
Tuesday, November 06, 2007
వాడే(పోలీస్)వీడు(దొంగ)
ఈమధ్య ఒక డి.ఎస్.పి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని వార్త వచ్చింది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే ఉండాలి.నేరాలను అరికట్టాల్సిన పోలీస్ ఆఫీసర్ దొంగతనం నేరంపై అరెస్ట్ కావడం విశేషమే మరి . ఇతను అసలు పోలీస్ శాఖలో చేరక ముందే నేర పూరిత మనస్తత్వం కలవాడై ఉంటే సరే, కాని కొంత మంది పొలిసు శాఖ లొ చేరక మనుపు చాలా నిజాయతీ పరులు కూడా చేరిన తరువాత నేర ప్రవృత్తిని అలవరచుకుంటారు . మానసిక శాస్త్ర పరంగా ఇది మరీ విడ్డూరం ఏమీ కాదు అలా జరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమం ఎలా ఉంటుందంటే నేర ప్రవృత్తి పట్ల అసహ్యం వ్యక్తం చేసేవారు సైతం పోలీస్ శాఖ లో చేరింతరువాత తమ వృత్తిలో భాగంగా నేరస్తులతో కలసి సంచరించటం జరుగుతుంది తప్పదు కదా . అప్పుడు వీరిపట్ల అంతకు ముందు ఉన్న
అసహ్యం స్థానం లో ఆసక్తి తో కూడిన పరిశీలన మొదలవుతుంది.
నేరాలు ఎలా జరుగుతాయి ? ఎందుకు జరుగుతాయి ? ఫలితం ఏమిటి ?
అనే విషయాలమీద . ఈ పరిశీలన దశ దాటిన తరువాత నేరస్తుల పట్ల సానుభూతి మొదలవుతుంది. తరువాతి దశ వాడిస్థానం లోఉంటే తానేమి చేస్తాడు? అని అంచనా వేసుకుందుకు ప్రయత్నిస్తాడు. పరకాయ ప్రవేశం లా అన్న మాట.
తరువాత దశ ఇంకేమి ఉంది ? మనసులో అంచనా వేసుకునే బదులు స్వయం గా ఒక నేరం లో పాల్గొని చూస్తాడు.
దాని తరువాత అదే అలవాటవుతుంది. వాడు వీడు అవుతాడు.
6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు అనటం లో అర్ధం ఇదే.
దొంగనోట్ల మార్పిడి, ల్యాండ్ మాఫియా గ్యాంగులూ వగైరా చట్ట వ్యతిరేక కార్య కలాపాలలో ఎక్కువగా మనం పోలీస్ ల పాత్ర చూస్తుంటాము. కొన్ని నేరాలలో వీరి పాత్రే ప్రధానంగా ఉండటం కూడా మనం చూస్తుంటాం. కారణం సావాస దోషమే. అయితే అందరు పోలీసులు ఇలాగ తయారు అవ్వాలని ఏమీలేదు.
ప్రతి మగవాడిలోనూ ఆడ హార్మోన్లు , ప్రతి స్త్రీ లోనూ మగ హార్మోన్లూ ఉండటం ఎలా సామాన్యమో అలాగే ప్రతి వారి లోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పరిస్థితులని బట్టి, వ్యక్తిని బట్టి ఆయా గుణాలు ప్రేరేపించబడతాయి. తదనుగుణంగా మనిషి తయారవుతాడు.
వాడు వీడుగా అవటానికి పోలీసే కానక్కరలేదు. మామూలు మనుషులైనా సరే ఇలా మారిపోయే అవకాశం ఉంది.
అయితే పోలీస్ లేఎక్కువ మారుతారు ఎందుకంటే నేరస్తులతో ఎక్కువ సహవాసం వీరికే తప్పనిసరి కాబట్టి.
Labels: సామాజికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 9:02 PM 5 comments
Thursday, November 01, 2007
కష్టాలన్నీ మంచివారికేనా
మామూలుగా మనకు సామాన్యులు ,చెడ్డవాళ్ళు ఏదో పద్దతిలో సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తారు .కాని మనం మంచివాళ్ళు ,నీతిమంతులు అని చెప్పుకునే కొందరు ఎక్కువ కష్టాలు పడుతూ కనపడుతుంటారు . ఎందుకని ? ఇది నిజమేనా ? మన అపోహా ? నాకైతే నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే, ఈ ఆధ్యాత్మికవాదులూ , మంచివాళ్ళూ, మామూలు విషయాలకు ఫ్రాధాన్యం ఇవ్వరు. వాళ్ళ దృష్టి అంతా శాశ్వతానందం మీదా, అలౌకిక విషయాలమీదా వుంటుంది. అందుకనే వీరు ప్రాపంచిక విషయాలలో (సామాన్యులకువలే ఆస్తులూ, సౌకర్యాలూ వగైరా సమకూర్చుకోవటం లో) లౌక్యంగా వ్యవహరించడం మీద శ్రద్ద చూపరు. అందుచేతనే దైనందిన వ్యవహారాల్లో ను, వివిధ సామాన్య విషయాల్లోను వీరు వెనకపడి పోతూ వుంటారు.తద్వారా కష్టాలు తెచ్చుకుంటారు. ఇది మనం అంగీకరించాలి.
ఒక మంచివాడు, చెడ్దవాడు పేకాటో, చదరంగమో ఆడుతున్నారనుకోండి. ఎవరు గెలుస్తారు ?నిస్సందేహంగా ఆట ఎవరికి బాగా వచ్చో వాడే గెలుస్తాడు. మంచివాడే గెలవాలి చెడ్దవాడు వోడిపోవాలంటే కుదరదు మరి . మంచివాడైనా మహాత్ముడైనా తను పాల్గొనే ఆట ఎలా ఆడాలో తెలియకపోతే ఓడిపోక తప్పదు. ఆట గెలవటానికీ, అతని మంచితనానికీ సంబంధమే లేదు.
ఇంతకూ బయట నుంచి చూసే మనం , వారు పొందుతున్నారనుకొంటున్న కష్టం అంత తీవ్రంగాను తమలోతాము వాళ్ళూ పొందుతారా? అని. ఏ మాత్రం పొందరు. ఎందుకంటే. ఇలాంటి చిన్న చిన్న కష్టాలు, వైఫల్యాలు, నష్టాలు వారినేమీ చేయలేవు.వారు విజయాలకు పొంగి పోరు, ఓటములకు కృంగిపోరు.కారణం వారి దృష్టి ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి.
Labels: ఆధ్యాత్మికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 10:10 PM 3 comments


