మనలో చాలా మందికి ఒక భాషో రెండుభాషలో తెలిసివుండటం జరుగుతుంది. దేశమంతా తిరిగే వారికి మహా అయితే 6,7 భాషలలో ప్రవేశం ఉండవచ్చు. కాని కొంతమంది మహా పండితులు వుంటారు. వారికి కొన్ని పదుల సంఖ్యలో భాషలలో పాండిత్యమే ఉంటుంది. అలాంటి కొందరిలో మన తెలుగువారు పి.వి నరసిం హారావు గారు ఉంటారు . ఇంకా కొందరిలో మన దేశ ప్రముఖ రచయిత మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్. ఈయన పేరు సాహిత్యంతో సంబంధం వున్నవారందరికీ చిర పరిచితమే. ఈయన హిందీలో వ్రాసిన " వోల్గా సే గంగ" అనే గ్రంధం దగ్గర దగ్గర నలభై భాషలకి అనువదింప బడింది . ఈయన ప్రపంచం అంతా సంచరించారు. ప్రపంచమంతా మాట్లాడే భాషలు సుమారుగా మూడువేల వరకూ ఉంటాయి . వాటిని పది కుటుంబాలుగా విభజించారు. వాటిలో చాలా భాషా కుటుంబాలతో ఈయనకి ప్రవేశం వుంది. సంస్కృతం ,పాళి భాషల్లో ఈయన మహా పండితుడు. బౌద్ద సాహిత్యంలో ఈయన పట్టు ఎంతటిదంటే ఆయన జీవించిన కాలంలోనే కాదు ఇప్పటి వరకూ కూడా ఈయనను మించిన వారు లేరు అని చెబుతారు. బౌద్ద సాహిత్యాన్ని ఈయన రష్యన్ భాషలోనికి అనువదించారు. ఈయనకు "త్రిపిటకాచార్య"అనే బిరుదు కూడ వున్నది.
ప్రపంచ భాషలే కాక, మనదేశంలో మాట్లాడే భాషలు కూడా ఈయనకు చాలా వచ్చు . ఒకసారి మన తెలుగు వారైన డా.సంజీవ్ దేవ్ (ఈయన కూడా రచయిత,కవి,చిత్ర కారుడు, ప్రసిద్ధ కళా విమర్శకుడు) రాహుల్ సాంకౄత్యాయన్ ని మనరాష్ట్రాని కి ఆహ్వానించటం జరిగింది. ఆయన సంజీవ్ దేవ్ స్వగ్రామమైన తుమ్మపూడి వచ్చారు. 4,5 రోజులు మనరాష్ట్రంలోపర్యటించారు.
ఒకరోజు బౌద్ద చారిత్రక ప్రదేశాలయిన అమరావతి, నాగార్జునకొండ వగైరా, వగైరా ప్రాంతాలన్నీ పర్యటన చేయటానికి వెళ్ళారు. మధ్యలో ఒక చోట చెట్ల క్రింద విశ్రమించారు. ఆ ప్రక్కగా కొంతమంది లంబాడి తండావారి నివాసాలు కూడా వున్నాయి. వారుకూడా అక్కడేవుండి వారి భాషలో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. రాహుల్ సాంకౄత్యాయన్ వారి మాటలను కొంతసేపు శ్రద్దగా గమనించారు. తరువాత వాళ్ళతో వాళ్ళ భాషలోనే మాట్లాడటం ప్రారంభించారు. సంజీవ్ దేవ్ గారి ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే వారి భాషకు అసలు లిపి లేదు, పేరు లేదు. అది వారిలో వారు మాట్లాడుకునే భాష మాత్రమే. వేరెవరికి అర్ధంకాదు.
తర్వాత సంజీవ్ దేవ్ గారు ఆశ్చర్యంగా అడిగారు. ఇది మీకెలా సాధ్యమైంది? అని. అప్పుడు ఆయన "వారి మాటలను గమనించటం ద్వారా గుజరాత్ ,రాజస్థాన్ ల సరిహద్దు ప్రాంతాన్నించి వారు వచ్చారనీ, ఆ రెండుభాషలనూ వీరు సంకరం చేసి మాట్లాడుకుంటున్నారనీ గమనించాను. వారికి వలెనే ఆభాషల్లో ని క్రియాపదాలను అపభ్రంశం చేసి మాట్లాడాను. అందుచేత వారికి అది అర్ధమైంది." అని చెప్పారు.
అదీ అయన భాషా ప్రజ్ణ. ఈ విషయాన్ని రాహుల్ సాంకౄత్యాయన్ తో తనకున్న అనుభవాన్ని వివరిస్తూ సంజీవ్ దేవ్ గారు ఒకచోట వ్రాసారు.
ఇంతకూ విషాదం ఏమిటంటే ఇంతటి ప్రజ్ణా శేలి, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు జ్ణాపక శక్తిని పూర్తిగా కోల్పోవడమే ప్రధాన లక్షణం గా గల వ్యాధితో మరణించారు. తన పేరును తానే మరిచిపోయేంత మతిమరుపు అది. జీవిత చరమాంకం లో ఏ రెండు పదాలనూ అర్ధవంతమైన క్రమంలో మాట్లాడలేక పోయారు.
Monday, October 29, 2007
మహాపండిత రాహుల్ సాంకౄత్యాయన్--బహు భాషా పాండిత్యం
Labels: జీవిత చరిత్రలు
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 10:31 PM 2 comments
Thursday, October 25, 2007
అంతా మన మంచికే
కొన్ని సంఘటనలలో మన పొరపాట్లు లేకపోయినా, మనసుని పాడుచేసే సందర్భాలు ఎదుర్కోవలసి రావటం అనేది ఎవరికైనా అనుభవమే.
రోజువారీ కార్యక్రమాలలో అనుభవమయ్యే కష్ట నష్టాలు, అవమానాలు, కలతలు, నలతలూ మన మనసులను అప్పుడప్పుడు పాడు చేయటం సహజంగా జరుగుతూనే వుంటుంది. కాని వాటిని వేటికవి విడదీసి చూసుకుని సంకుచితంగా విశ్లేషించుకుని బాధపడటం తప్పు. అలా చిన్న చిన్న వాటికి అతిగా స్పందించటం మాని, ఇంకా పైస్థాయి నుంచి వాటిని అవగాహన చేసుకుంటూ, వాటి పరమార్ధం ఏమైవుండవచ్చో గ్రహిస్తూ, వాటి వలన జరుగబోయే మంచిని అంచనా వేయాలి. అలా ముందుకు సాగాలి.
గతంలో మనల్ని బాధపెట్టిన అనేక సందర్భాలను గుర్తు తెచ్చుకుంటే వాటివలన తదనంతర కాలంలో మనకు జరిగిన మంచి, మనలో వచ్చిన మంచిమార్పులు ఎవరైనా గుర్తించవచ్చు. మనం ఎదుర్కొనే కష్టాలు, అపజయాలు మనలను మరింత బలంగా తయారు చేస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఈ పరిస్థితులన్నీ గతంలో మనం చేసిన పనుల ఫలితాలే. మనం అనుభవించక తప్పదు. మనం గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం "జరిగిందంతా మంచే, జరగుతున్నదీ మంచే, జరుగబోయేది మంచే".
Labels: ఆధ్యాత్మికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:05 PM 0 comments
Monday, October 22, 2007
Saturday, October 20, 2007
రిపార్టీ
పూర్వం అహంకారం పాలు కొంచెం ఎక్కువైన యువరాజు ఒకడు తన రాజ్యంలోనే వేరే నగరంలో జరుగుతున్న తిరునాళ్ళుచూడటానికి వెళ్ళాడు. అక్కడ జనసందోహంలో ఒక మనిషిని ఇంచుమించు తనను పోలిన, తన వయస్సు తోనే ఉన్న యువకుడిని చూడటం తటస్థించింది.
తన తండ్రి శృంగారప్రియత్వం బాగా తెలిసిన వాడవడం చేత, ఈ మనిషి మీద యువరాజుకి చులకన భావం ఏర్పడింది. తన తండ్రి వలననే ఈ యువకుడు పుట్టివుంటాడని యువరాజు అనుమానం. అయినా అనుమానం నివృత్తి చేసుకోవటం కోసం ఆ మనిషిని దగ్గరకు పిలిచి అడిగాడు. "ఏమోయ్ ఏ ఊరు నీది? "అని, అతను "ఈ ఊరే యువరాజా" అని సమాధానమిచ్చాడు అంతట యువరాజు, "మీ అమ్మ గతంలో ఎపుడైనా రాజధానిలో ఉండేదా? " అని అడిగాడు.
ఈ ప్రశ్నలో గూఢార్ధాన్ని ఆ వ్యక్తి గమనించాడు. ఏమైనా యువరాజుకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతనప్పుడు ఇచ్చిన సమాధానం. "లేదండి, మా అమ్మ ఎప్పుడూ రాజధానిలో ఉండలేదు కానీ మా నాన్న మాత్రం నేను పుట్టక క్రితం రాజధానిలోనే ఉండేవాడట."
అంతే యువరాజు ముఖం ఎలా ఉంటుందో ఊహించండి.
ఈ రిపార్టీ ఎప్పుడో ఎక్కడ చదివానో గుర్తులేదు కాని నాకు చాలా బాగానచ్చింది. మరి మీకూ?
Labels: సామాజికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 11:11 PM 0 comments
Wednesday, October 17, 2007
డబ్బు ప్రాధాన్యత
ప్రతి మనిషికీ ఎన్నో అవసరాలు వుంటాయి. వాటిల్లో చాలా వాటిని డబ్బుతో సమకూర్చుకోవచ్చును. కానీ అన్నీ డబ్బుతో సమకూడవు. ముఖ్యంగా ఆనందం , సంతోషం కేవలం డబ్బుతో సంపాదించలేము. కానీ చాలామంది పొరపాటు అవగాహనతో డబ్బుకు లేనిపోని ప్రాధాన్యతనిచ్చి, దాని సంపాదన కోసం తమకు అనేక రంగాల్లో వున్న ఆసక్తులను, అభిలాషలను చంపుకొని శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు.
ఏ రంగంలో అయినా మనం తీవ్రంగా కృషి చేస్తే ఆ రంగంలో విజయం సాధించటం సహజంగా జరిగేదే. అలా ఒకవేళ విజయం సాధించి డబ్బు సంపాదించినా ఆనందం ,తృప్తిని పొందుతారని గ్యారంటీ ఏం లేదు. అనుకున్నంత సంపాదించి దానితో అన్నిరకాల సౌకర్యాలూ సమకూర్చుకునీ కూడా పొందామనుకున్న ఆనందాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేరు. చాలా త్వరగానే మామూలైపోతారు. మళ్ళీ పరుగు , క్రొత్తకోరికలు తీర్చుకోవటం కోసం. ఎక్కువ సంపాదిస్తే , జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చుననుకుంటారు కానీ కరెక్ట్ మాత్రం కాదు. కడుపు కాలుతున్నపుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ, కడుపు నిండినతరువాత సంపాదించే ఏ పది రూపాయలకీ ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా వుండేవాడికి డబ్బుతోనూ, సౌకర్యాలతోనూ పనేలేదు.
ఇక్కడ ఒక చిన్న కధ.
తీరికదొరికిన కోటీశ్వరుడైన వ్యాపారి ఒకడు తీరం వెంట వెళుతున్నాడు. అక్కడ ఒక జాలరి వలను ప్రక్కనబెట్టి చెట్టుక్రింద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు.జాలరి అంత సంతోషంగా ఉండటం చూసిన వ్యాపారికి అతనితో మట్లాడాలనిపించింది.దగ్గరికి పోయి మాట కలిపాడు . వారిమధ్య సంభాషణ ఇలా సాగింది.
వ్యాపారి:ఏమోయ్ ఏ రోజేం పనిలేదా?
జాలరి :చేపలు పట్టడం , అమ్మటం అయిపోయిందండి. పని అయిపోయిందిగదాని విశ్రాంతి తీసుకుంటున్నాను. వ్యాపారి: పని అయిపోవటం ఏమిటి? ఇంకా చేపలు పట్టవచ్చుకదా?
జాలరి : ఇంకాఎందుకండీ?
వ్యాపారి: ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా?
జాలరి : ఇంకా సంపాదించి ఏం చేయాలండీ?
వ్యాపారి: ఏంచేయాలి అంటావేం పిచ్చివాడా? స్వంతంగా పడవ కొనుక్కోవచ్చు. ఇంకా మనుషులను పెట్టుకొని, ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు.ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
జాలరి : అప్పుడు?
వ్యాపారి: ఇల్లు కొనుక్కోవచ్చు.
జాలరి : తర్వాత?
వ్యాపారి: ఇంకా సంపాదించి, టివి, కారు, ఫ్రిజ్ వగైరా కొనుక్కోవచ్చు.
జాలరి : అప్పుడేమవుతుంది? వ్యాపారి: నువ్వు ఆనందంగా , సంతోషంగా జీవించవచ్చు.
జాలరి : అలాగా! అయితే ఇపుడు నేను చేస్తున్నదేమిటండీ? ఇపుడు నేను ఆనందంగానే వున్నాను కదా? అవన్నీ చేయకపోతే నేను సంతోషంగా వుండనని మీ ఉద్దేశ్యమా? వ్యాపారి నిర్ఘాంతపోయాడు.
మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు, సౌకర్యాలు వున్నాయన్న దానిమీద మనసంతోషం అధారపడదు. పై కధ చదివింతర్వాత ఇదేదో అభివృధ్ధికి వ్యతిరేకం , సోమరివాళ్ళకి అనుకూలం అనుకోవచ్చు. అలా అర్ధం చేసుకోకూడదు. అభివృధ్ధి అవసరమే. కాని అది ఎవరికి? ఎంతవరకు? అనేది ఎవరికి వారు విజ్ణతతో తెలుసుకోవలసిన విషయం. అందరికీ అన్నీ అవసరం కావు. మనిషి మనిషికీ ప్రాధామ్యాలూ ,అవసరాలూ మారుతూ వుంటాయి. "ఆలశ్యం అమృతం విషం" అనిచెప్పిన పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా చెప్పారు. రెండూ పరస్పర విరుధ్ధంగావుంటాయి. రెండూ కరెక్టే కాని ఎవరికి వారు ఏ ఏ సందర్భాల్లో వీటిని అన్వయించుకోవచ్చు అనేది వారి వారి విచక్షణని బట్టి వుంటుంది. డబ్బు సంపాదన విషయం కూడా అంతే.
అసలు మంచి సంగీతం వింటూ ఆనందించటానికీ, ప్రకృతి అందాలని ఆస్వాదించటానికీ, భార్యాపిల్లలతో సంతోషంగా గడపటానికీ, ఇష్టమైనపుస్తకం చదువుతూ ఆనందించటానికీ డబ్బుతో పనేముందీ?
Labels: సామాజికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:15 PM 1 comments
Monday, October 08, 2007
రవీంద్రనాధ్ టాగోర్ సర్ ప్లస్ థీరీ

ప్రతీ మనిషికీ అనేక రకాల భావాలు వస్తుంటాయి. అతను భరించగలిగిన పరిధిలో వచ్చే భావాలు అతనిలోనే జీర్ణమైపోతాయి.తన పరిధికి మించి తను తట్టుకోలేనంతటి భావాలు వస్తే మాత్రం మరుగుతున్న పాలు పొంగిపోయినట్లు వెల్లువలా ఇవతలకు వస్తాయి. అలా వచ్చే అదనపు భావావేశమే కవితగానో, గానంగానో, శిల్పంగానో మారుతుంది. మనం చూసే కళలన్నీ అలా ఏర్పడినవే.
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:33 PM 0 comments


