Thursday, December 06, 2007

నిజాం నవాబు గారి పిసినిగొట్టుతనం

ప్రస్తుతం అంతా నిజాం పాలన గురించి చర్చలు చేస్తున్నారు. ఆయన పాలన లోని మంచి చెడ్డలు గురించి నాకు తెలిసింది తక్కువ కాబట్టి ఆ చర్చ లోకి పోను. అయితే , ఆయన యొక్క గుణగణాలు గురించి నాకు తెలిసిన విషయాలు వ్రాద్దామనుకుంటున్నాను.

మనం చెప్పుకుంటున్న నిజాం గారి పూర్తి పేరు "ల్యూటినెంట్ , జనరల్ , హిజ్ ఎ క్జాల్టెడ్ హైనెస్ , అసఫ్ జా ముజఫర్ ఉల్ ముల్క్ , నిజాం ఉద్దౌలా , సర్ మీర్ ఉస్మాన్ అలిఖాన్ బహద్దూర్ , ఫతే జంగ్. ఆయన కాలంలో ఆయనంత ధనవంతుడు లేడు ప్రపంచం మొత్తంలో. అలాగే పిసినిగొట్టు తనం లో ఆయనకు సాటి రాగలవారు లేరని చెప్పుకొనేవారు.

ఆయన కోశాగారం నిండా అంతులేని సంపద మూలుగుతూ వుండేది.దానిని లెక్కగట్టడం ఎవరికైనా అసంభవం అన్నట్లు ఉండేది ఆయన ఐశ్వర్యం . అంతలా సంపదతో తులతూగుతున్నా ఆయన అత్యంత నిరాడంబరంగా బ్రతికేవాడు. చివరికి ఆయనకు అత్యంత ప్రియమైన ధూమపానం విషయం లో కూడా పొదుపుగానే వుండేవారు.నవాబు గారు చైన్ స్మోకర్. అయినా వారు కనీసం యాష్ ట్రే నైనా వాడేవారు కాదు. పైగా హైదరాబాదు లోనే తయారయ్యే అత్యంత చౌక రకం సిగరెట్ చార్మినార్ నే కాల్చేవారు.

ఓసారి భారత ప్రభుత్వ సలహాదారు గా ఉన్న వి .పి . మీనన్ గారేదో రాచకార్యం పై నవాబు గారి దర్శనం చేసుకోగా నవాబు గారు ఈచార్మినార్ సిగరెట్ నే వారికి ఆఫర్ చేసారు . కాని మీనన్ మహాశయుడు మర్యాదగా వెంటనే తన జేబు లోంచి తాను వాడే ఖరీదైన అమెరికన్ సిగరెట్ల పేకెట్ తీసి నవాబు గారికి ఆఫర్ చేసారు .

అప్పుడు నవాబు గారు సంతోషించి ఒకటికి బదులు నాలుగు సిగరెట్లు ఆ పేకెట్ నుండి తీసుకుని తన సిగరెట్ కేస్ లోదాచుకుని యధావిధిగా తన చార్మినార్ సిగరెట్ నే కాల్చేసారు

మరికొంతకాలం తరువాత ఈమీనన్ గారే మరేదో పని మీద నవాబుగారిని దర్శించుకోగా , నవాబు గారు తక్షణం వారికి ఖరీదైన అమెరికన్ సిగరెట్ ను ఒక దానిని ఆఫర్ చేసారట . మీనన్ గారు అది కొన్నాళ్ళ క్రితం నవాబు గారు తన సిగరెట్ పేకెట్ నుండి తీసుకున్న నాల్గింటి లోనూ ఒకటని గుర్తించగానే పాపం దాదాపు మూర్చ పోయినంత పనయిందట .

నవాబు గారు నగరం లో ఎవరిదైనా కొత్తకారు కనిపిస్తే ముచ్చట పడిపోయేవారట. వారి సరదా చూసి వారి అంతరంగికులు తక్షణం ఆకారు వోనరుకు కబురు పంపేవారు. ఆ ఓనరేమో తన జన్మ ధన్యమైందనుకుని మరుక్షణం తన కారుని శుభ్రం గా కడిగించి మరీ నవాబు గారికి పంపేవారు.

కానీ ఆకారు మాత్రం నవాబు గారి సరదా తీరగానే సరాసరి నవాబు గారి గారేజి లోకి పయనించేది . తన కారు పంపమని అడగలేక అవతలి పెద్దమనిషి చచ్చినట్లు ఆశవదులుకునేవాడు .ఈవిధంగా నవాబు గారు తన గారేజి ఓ నాలుగు వందల కార్ల తో నింపి పారేశారు .

అలాగే నవాబు గారు వివాహాది శుభ కార్యాలకి వేటికైనా వెడితే వారేమీ బహుమతులు ఇచ్చేవారు కాదు. పైగా ఆ ఉత్సవం జరుపుకుంటున్నవారే నవాబు గారి రాకకు కృతజ్ణతా సూచకంగా విలువైన కానుకలు సమర్పించుకొనేవారు .

ఇంతా చేసి నవాబు గారి సంస్థానం ఇంగ్లాండ్ కన్నా వైశాల్యంలో పెద్దది.ఆదాయం కూడా అపరితంగానే ఉండేది. అయినా ఆయన డబ్బాశ ఆస్థాయిలో ఉండేది. ఇంకా ఎన్నో కధలు ఆయన పిసినిగొట్టు తనం గురించి ఉన్నాయి. స్వాతంత్ర్యం రాక ముందు మన దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండి , ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. ఆ రాజులందరి జీవన శైలి ఎలావుండేదో బాగా పరిశీలించి దివాన్ జర్మణి దాస్ అనే ఆయన "మహారాజా" పేరుతో ఒక పుస్తకం వ్రాశాడట . దానిని చలసాని ప్రసాదరావు గారు "రాజుల బూజు " గా తెలుగులోనికి అనువదించారు. ఆ పుస్తకం చదువుతుంటే ఆరాజుల వ్యవహారం ఒకింత వినోదంగానే ఉన్నా , అప్పటి ప్రజల పరిస్థితి తలుచుకుంటే కొంత విషాదంగా కూడా ఉంటుంది . దీనిలో నిజాం నవాబు గారి గుణ గుణాల గురించి చాలా ఉంది

5 comments:

Budaraju Aswin said...

బావుందండీ ...
ఓంట్లో బాలేదు కాని మీ బ్లాగు నన్ను అలా కూర్చోపెట్టింది ...

చార్మినార్ అంటే ఇప్పుడు market లో దొరికేవేనా ...

వాటికి అంత చరిత్ర ఉందన్న మాట, నాకు ఇప్పటి వరకూ తెలియదు.

aishwarya said...

i`ve read that book by jarmani das....he also stated that this Nijam was born to a marwadi and looked exactly like that marwadi man with whom his mother had an affair....that was an excellent book about kingdoms and kings lives.....

satish kumar said...

mee blog బావుందండీ
Mee andariki naado manavi..
naaku kuuda alanti books mariyu navalalu chadavalani undi..kaani avi ekkada dorukutaayo telidu..Mana telugu writers navalalu ekkada dorukothaayo cheppandi..kaneesam ae website lo naina evaraina mahaanbhaavudu pettaada..koncham aa address ichhi punyam kattukondi...Aishwarya gaaru mee ku emaina telisthe dayachesi cheppandi..

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అయిశ్వర్య సతిష్,అశ్విన్,



ఇంకా మరికొందరి గురించి తెలుసుకోవాలంటే ఎస్,గోపాల్ రచనలు కొన్ని చదవండి.

రవీంద్రనాధ్ గెడ్డం said...

అశ్విన్ గార్కి,
నెనర్లు.
ఇప్పుడు దొరికే చార్మినార్ అప్పటినుండి ఉందని దీనిని బట్టి తెలుస్తుంది.


ఐశ్వర్య గార్కి,
మీతో ఏకీభవిస్తున్నా, చాలా మంచి పుస్తకం. నెనర్లు.

సతీష్ గార్కి,
నెనర్లు. ఈ పుస్తకం నేను ఎపుడో సుమారు 20 సంవత్సరాల క్రితం కొన్నాను. మీకు ఇలాంటివి "విశాలాంధ్ర" లాంటి షాపుల్లో దొరకవచ్చు.