Sunday, November 25, 2007

జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం

మనలో ప్రతి ఒక్కరికీ "భయం " గురించి అనుభవమే. జీవితం లో ఏదో ఒక విషయాన్ని గురించి భయపడనివారు ఉండరు. భయపెట్టే విషయాలు మనిషి మనిషికీ వేరు వేరుగా ఉన్నా , అందరినీ భయపెట్టే విషయం గా మాత్రం మరణం గురించి చెప్పవచ్చు . మరణభయం లేనివారు చాలా అరుదుగా ఉంటారు.

మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను ( కూడ బెట్టుకున్న జ్ణాపకాలు , అనుభవాలు , అభిప్రాయాలు వగైరా) మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది . మరణం తరువాత మనం ఏమవుతాం ? అనే ప్రశ్నకు నమ్మకమైన సమాధానం లేకపోవటం కూడా మనలో భయానికి మరో కారణం .

మరణం పట్ల మన భయం పోవాలంటే మనలో చాలామందికి మరణం తరువాత ఏదోవిధంగా అంటే సూక్ష్మ దేహమనో , మరోజన్మ అనో ఏదో పేరుతో కొనసాగుతామని నమ్మకం కుదరాలి లేదా కనీసం మరణం తరువాత ఏమవుతుంది? అనే విషయం తెలియాలి . అంటే జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో తెలియాలి . అపుడు చావు భయం చాలా తగ్గుతుంది .

చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి . వాటిద్వారా మనం అందరికీ తెలిసున్న జీవితపు ఈవలి వొడ్డు నుండి ఉందని నమ్ముతున్న మరణం తరువాతి ఆవలి వొడ్డుకు వారధి నిర్మించుకుంటాం . ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం .

కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు. ఈ ప్రపంచం మొత్తంలో అన్నీ అశాశ్వతమే అయినపుడు మనం మాత్రం శాశ్వతం ఎలా అవుతాం ? అని ప్రశ్నించటమే కాక ఆయన శాశ్వతంగా ఉండటం అనే దానిలో ఉండే అవలక్షణాన్ని కూడా వివరిస్తాడు .

శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. అలా ఏ కొత్తదనమూ లేకుండా ఎంత కాలం కొనసాగితే మాత్రం ఏమి లాభం ? అంటాడాయన . కొనసాగటం ఆగినపుడే కదా కొత్తదేదైనా ప్రవేశించటం సాధ్యపడేది? పాత విషయాలకు సంబంధించి మనం మరణిస్తే తప్ప కొత్తవీ , సృజనాత్మకమైనవీ ఏవీ మనలోనికి చేరవు. కాబట్టి మనం అంతం కావటానికి భయపడకూడదు . శాశ్వతత్వం మీద ఇష్టాన్ని ఎవరు చంపు కుంటారో వారికి మరణం పట్ల భయం ఉండదు .

సరే , ఇక జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలమా? అనే ప్రశ్నకు జె. కె. గారు తెలుసుకోగలమనే చెబుతారు. మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది . అలా చేయగలవారు మాత్రమే జీవించి ఉండగా మరణాన్ని తెలుసుకోగలరు అంటారాయన.

ఇలా మన నమ్మకాలు , జ్ణాపకాలు , అనుబంధాలతో కూడిన నేపధ్యం మొత్తాన్ని అంతం చేయటం అంటే , ధ్యానం , సమాధి మొదలైన యోగ ప్రక్రియలలో చెప్పబడే మనసుని అదుపు చేయటం , శూన్య పరచటం లాంటిదన్నమాట . అపుడు మాత్రమే మనలోనికి కొత్తదీ , సృజనాత్మకమైనదీ , సత్యం , దైవం మరేదైనా అనండి అది ప్రవేశించటానికి ఆస్కారముంటుంది . అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు దీనిని సాధించే నిమిత్తం ఎవరికీ ఏ ప్రక్రియనీ సూచించరు . ఎవరికి వారు తమ స్వంత మార్గాన్ని అన్వేషించుకోవలసిందే అంటారాయన .

7 comments:

కందర్ప కృష్ణ మోహన్ - said...

మీకు నా మనఃపూర్వక అభినందనలు
నేను కూడా 1992 నుంచీ జెకె ని ఎంతో అభిమానిస్తూ చదువుతున్నవాణ్ని..

రవీంద్రనాధ్ గెడ్డం said...

కృష్ణ మోహన్ గార్కి,
కృతజ్ణ్తలు.తెలుగు వాడిగా పుట్టి విశ్వమానవుడి స్థాయి కెదిగిన "జెకె" ను చూసి మనమంతా గర్వించాలి.

రాకేశ్వర రావు said...

మీరు వ్రాసిన ఈటపా ప్రొద్దుట చదివి దాని మీద వ్యాఖ్యానించడం మొదలు పెడితే, అదే ఒక టాపా అయ్యిపోయింది.
మీ టపా పై నా టపా ఇక్కడ చదవగలరు.

radhika said...

చాలా విషయాలలో భవ బంధాలు లేనప్పటి అభిప్రాయాలు,వాటిలో చిక్కుకున్నాకా పూర్తిగా మారిపోతాయి. వాటిలో మరణం పై అభిప్రాయం మరీ ముఖ్యమైనది.మీ టపాలో చెప్పిన విషయాలు బాధ్యతలు వున్నవారి అభిప్రాయాలకి దగ్గరా వున్నాయి.రాకేశ్వర గారి టపా పెళ్ళికానివారి అభిప్రాయాలకి దగ్గరగా వుంది.లలిత గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి.వాటిని నమ్మగలిగితే మరణ భయం వుండదేమో?

రవీంద్రనాధ్ గెడ్డం said...

రాధిక గారూ,
జెకె వివరించింది స్థూలంగా మనుష్యులందరి మరణభయం గురించి అని నా అభిప్రాయం. ఇక లలితాజీ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. జీవితం మాత్రమే జ్ఞాతం .మరణం అనేది అజ్ఞాతమైనది. అజ్ఞాతమైన దానిని గురించి భయపడటంలో అర్ధం లేదు.

రవీంద్రనాధ్ గెడ్డం said...

రాకేశ్వర,
మీదృష్టి, జె కె దృష్టి ఒకే విధంగా వుండాలని రూలేమీ లేదు.
మీరే(రూ) కరెక్ట్ కావచ్చు.
జెకె గారు కూడా ఎప్పుడూ తనను అనుసరించమని చెప్పలేదు. శిష్యులని అంగీకరించలేదు.తనను తాను గురువు గా ఎక్కడా చెప్పుకోలేదు.
ఏమైనా, నేను చెప్పాననుకున్నదానికీ, మీరు అర్ధం చేసుకున్న దానికీ కొంచం తేడావుందని నా అనుమానం.
జెకె గారు ఎన్నో ప్రసంగాలలో చెప్పిన పేజీల కొద్దీ వచ్చే సంక్లిష్టమైన ఈ విషయాన్ని కొన్ని లైన్ల టపాలో చెప్పటానికి ప్రయత్నించటం లో వచ్చే ఇబ్బందే ఇది.
మరొకసారి ఆయన వ్రాసిన The First and Last Freedam(బహుశా మీరు ఈపాటికే చదివి వుంటారు.) చదవమని కోరుతున్నా.
ప్రపంచం మొత్తమ్మీద మార్క్సిజం ఇంచుమించుగా ఫెయిలయినా కార్ల్ మార్క్స్ గొప్పదనమేమీ తగ్గదు. అలాగే మీరూ , నేనూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జెకె గారి గొప్పదనానికి వచ్చిన నష్టం ఏమీలేదు.
ప్రపంచ మేధావులు, మహాపురుషులు కొత్త కొత్త ఆలోచనావిధానాలను ఆవిష్కరిస్తారు. అనుసరించాలా వద్దా అనేది సమాజం ఇష్టం.

రాకేశ్వర రావు said...

"మీరే(రూ) కరెక్ట్ కావచ్చు."
ఇందులో తప్పులూ ఒప్పులూ ఏఁవీ వుండవండి. భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలూ.
జిడ్డు గొప్పవారు కాబట్టి కొన్ని చూపించారు. నేను నాకు పనికివచ్చే మర్గాన్ని (నా గురువుల నుండి నేర్చుకున్నవి) ఈ టపా నేపథ్యంలో తెలిపా.
సూక్షంగా గమనిస్తే రెండూ ఒకే పని చేసిపెడతాయి చివరకి.
కాబట్టి ఇందులో ఒప్పుకోకపోవడాలూ లేకపోవడాలూ ఏఁవీ లేవు. అందుకే వాటిని మనం 'మతం' అంటాం.
మార్క్సు జిడ్డుకే కాదు. ఎవరు మనతో అంగీకరించినా లేకున్నా మనము మనమే!
మళ్లీ చెప్పుతున్నాను మీరు టపా చాలాబాగా వ్రాసారు. భవిష్యత్తులో ఇలాంటి టపాలు ఇంకా చూడగలమని ఆశిస్తున్నాను.


Blogspot Templates by Isnaini Dot Com and Insurance News. Powered by Blogger