Saturday, November 17, 2007

ధ్యానం యొక్క అత్యున్నత లక్ష్యం


సాధారణంగా ప్రతీ మనిషికీ తను ఉండే నిద్రావస్థ, జాగృదావస్థ ల గురించే తెలుస్తాయి. ఉదయాన్నే మేలుకోవటమే జాగృదావస్థ లోనికి వస్తాడు. రాత్రి నిద్ర పోతూ నిద్రావస్థ లోనికి పోతాడు. ఈ రెండు స్థితులు తప్ప మరోఅవస్థ గురించి తెలియదు.కాని అధ్యాత్మికవాదులు మరో అవస్థ గురించి కూడా చెబుతారు.అదే దైవీ అవస్థ. దీనినే అనంతదైవీ చైతన్యమనీ, అతీత చైతన్య స్థితీ అనీ రకరకాలుగా వర్ణిస్తారు.ఈ అవస్థ పరం గా మనమందరం ఇంకా నిద్రిస్తున్నట్లే లెక్క. ఒకవేళ ఎవరైనా ఈ స్థితి లోనికి మేలుకోవటం జరిగితే ( జ్ణాన నేత్రం తెరుచుకున్నట్లయితే ) వారికి తనే దేవుడిని అనే స్పృహ కలుగుతుంది. అంతవరకూ తను గడిపిన జీవితం అంతా నిద్ర లాంటిదని తెలుసుకుంటాడు. తన యొక్క అసలు స్వరూపం ఇదే ( పరమాత్మ ) అనీ , విశ్వమంతా తానై ఉన్నాననే నిజాన్ని తెలుసు కుంటాడు. ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. ఈ స్థితిలోనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. దీనిని ఎవరూ మాటలలో వర్ణించ లేరు, ఎందుకంటే ఇది మనసు పరిధిని దాటి ఉంటుంది కనుకనే దీనిని ఎవరికి వారు తమ అనుభవంలో తెలుసుకోవలసిందే.

తన స్వరూపమే ఆనంద స్వరూపమనీ , తనకు వేరుగా దేవుడు ఎక్కడో లేడనీ తనే దేవుడుననీ తెలుసు కోవటమే ప్రతీ మనిషి లక్ష్యం. ఈవిషయం ఎవరికి తెలిసినా , ఎవరికి తెలియకపోయినా అందరి ప్రయాణం అటే.ఈ జన్మ లో కావచ్చు లేదా మరికొన్ని జన్మల తరువాతైనా కావచ్చు. ఆలక్ష్యాన్ని చేరుకోవలసిందే.

ఆ స్థితిని ప్రయత్నంతో అనుభవం లోనికి తెచ్చుకోవాలంటే చపలమైన చిత్తానికి కళ్ళెం వేయాలి. మనసుని నిశ్చలం చేయాలి. లక్ష్యాన్ని ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనలోదైవ ప్రకాశం పొందటం కోసం అడ్డుగా వున్న మనసు అనే తెరను తొలగించాలి. ఇవన్నీ ధ్యాన యోగం తో సాధ్యపడతాయి. మన ప్రాచీన మహర్షులు ఆత్మసాక్షాత్కారం కోసం ధ్యాన యోగమే కాక ఇంకా భక్తి యోగమనీ, కర్మ యోగమనీ , రాజ యోగమనీ ఇంకా ఎన్నో మార్గాలు చెప్పారు. అన్ని మతాల సారమూ ఈస్థితి లోనికి మేలుకొమ్మనే .

దైవ సాక్షాత్కారమనేది మనిషి చేసే కృషిని బట్టి ఉంటుంది. ఈ విషయమ్మీదే దృష్టినంతా ఏకాగ్రపరచి కఠోర ధ్యానం ( తపస్సు ) తో గడపితే చాలా త్వరగానే భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు . లేదా చిత్త శుద్ది కరవైతే కొన్ని జన్మలే ఈ ప్రయత్నం లో ఖర్చయిపోవచ్చు.

ధ్యానం , సమాధి వగైరా ఆధ్యాత్మిక సాధనల వల్ల బి పి , అల్సర్లూ , టెన్షన్ లూ తగ్గుతాయనీ , మెదడు చురుకుదనం పెరుగుతుందనీ , అయిడియాలు బాగా వస్తాయని ఇలా చాలా చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తిస్తున్నారు. కానీ ధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని తెలుసుకోవాలి. ఆచరించాలి.

2 comments:

DILEEP said...

మీరు చెప్పిన విషయాల లో కొన్ని సందేహాలు ఇది వరకు నుండీ ఉన్నాయి.వాటి గురించి ఇది వరకు ఇక్కడ రాసాను.
http://mdileep.wordpress.com/

రవీంద్రనాధ్ గెడ్డం said...

దిలీప్,
చిన్న వయసులో ఇంత అన్వేషణ ప్రశంసనీయం. మీరు వివేకానంద గారి జ్ణాన యొగం, ముఖ్యంగా ధ్యానయోగం చదవండి. మీ సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి. ఇక మీ సందేహాలకి నాకు తొచిన సమాధానాలు .
1). ధ్యానం అనేది సూపర్ కాన్షస్ (అతీత చైతన్యం)కోసం
2). ధ్యానం అనే ప్రక్రియలోనే 3 దశలు ఉన్నాయి. అవి ధారణ, ధ్యానం, సమాధి.
3).కొద్దిగా అలానే అనిపిస్తుంది.


Blogspot Templates by Isnaini Dot Com and Insurance News. Powered by Blogger